ఏపి లో ఇక ప్రజా రవాణా బస్సులు ఇలా ఉంటాయి .

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణాకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బస్సులు నడిపేందుకు అవసరమైన కసరత్తును అధికారులు వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను సర్ధుబాటు చేశారు. దానికి సంబంధించిన మోడల్‌ పొటోలను ప్రజా రవాణా వ్యవస్థ విడుదల చేసింది.ఆర్టీసీ అధికారులు సూపర్ లగ్జరీ బస్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా మూడు వరసలు ఏర్పాటు చేసి వరుసలో ఒకే సీటు ఉండేలా చూసుకున్నారు. దీని ద్వారా భౌతిక దూరం పాటించేందుకు వీలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.ఈ మోడల్‌కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన వెంటనే మిగిలిన వాటిని కూడా మార్చివేసి సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. కాగా గతంలో బస్సులో మొత్తం 36 సీట్లు ఉండగా తాజా మార్పులతో 10 సీట్లు తక్కువగా ఉండనున్నాయి. దీంతో ఆర్టీసీపై కొంత నష్టాల భారం తప్పదనే వాదనలు వినబడుతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చార్జీలు పెంచే అవకాశం కూడా  ఏమైనా ఉంటుందా అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు.